విశ్వాసులు సంఘ చరిత్రను తెలుసుకోవడం అవసరమా? ఇంతకూ సంఘ చరిత్ర అంటే ఏమిటి?
విశ్వాసులు సంఘ చరిత్రను తెలుసుకోడానికి ముందు “సంఘం” అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలామంది పొరపాటుగా భావిస్తున్నట్టు సంఘం అంటే ఒక చర్చి బిల్డింగ్ కాదుకానీ, యేసుక్రీస్తును విశ్వసించి , ఆయనను అనుసరించే వారే (శిష్యులు) సంఘం.
మరో విధంగా చెప్పాలంటే క్రైస్తవులే సంఘం. ఈ విషయం మనకు అపోస్తుల కార్యాలు 11:26 చదివితే స్పష్టంగా అర్థమౌతుంది. దీని గురించి మేము గతంలో రాసిన సంఘం అంటే ఏమిటనే వ్యాసంలో మరిన్ని వివరాలు పొందుపరిచాము.
మన ముందు తరాలవారు ఏవిధంగా రాజ్యపరిపాలన చేసేవారో తెలుసుకోడానికి రాజకీయ చరిత్ర, అప్పటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సామాజిక చరిత్ర మనకు ఎలాగైతే సహాయపడుతున్నాయో, అలాగే మనకంటే ముందుగా క్రైస్తవులుగా జీవించినవారు (పితరులు), ప్రభువుపట్ల ఎంత విశ్వాసాన్ని కనుపరిచారో, వారు ఏం బోధించారో, వాక్యాన్ని ఎంతగా ప్రేమించారో, నమ్మారో, దానివల్ల వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో, ఇలాంటి విషయాలను తెలుసుకోడానికి మనకి సంఘ చరిత్ర సహాయపడుతుంది.
ప్రస్తుత సంఘాలలో ఇది చాలా నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం. క్రైస్తవ సంఘచరిత్రను తెలుసుకోవడం ప్రతీ క్రైస్తవుడి బాధ్యతగా మనం గుర్తించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ మనది కాదు.
చరిత్రలో వారు కనుపరచిన విశ్వాసాన్ని బట్టీ, ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా వారు చేసిన పోరాటాలూ, ప్రాణ త్యాగాలను బట్టీ మనకు దక్కిన ఫలితమే ఈ స్వేచ్చ. ఇందుకు మనమంతా వారికీ ఋణస్థులం, కృతజ్ఞత చూపవలసిన వారం.
ద్వితీయోపదేశకాండమ :10-11 వచనాలు ప్రకారం, మనం త్రవ్వని బావి నుంచి మనకు నీళ్లు లభిస్తున్నాయి , మనం నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటల ఫలాలనూ మనం పొందుతున్నాం, మనం కట్టని పురాలలో నివాసం చేస్తున్నాం. ఇవన్నీ పొందుతూ ఆనందిస్తూ వినయం లేని వారిలాగా గర్వంతో ఉందామా? లేదా వినయంతో, కృతజ్ఞతతో నిండినవారిగా ఉందామా?
సంఘ చరిత్ర అనేది మన కుటుంబ చరిత్ర. పరిశుద్ధాత్మ కార్యాలు మొదటి శతాబ్దంతో ఆగిపోలేదు. పరిశుద్దాత్మ దేవుడు నిరంతరం ఉన్నవాడు కాబట్టి తరతరాలకూ (రెండవ శతాబ్దం, మూడవ , నాల్గవ …. ) తన కాపుదల, తన గొప్ప కార్యాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.
మనమున్న 21వ శతాబ్దంలో సంఘాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎంతో గొప్పగా మాట్లాడతాయి కానీ రెండవ శతాబ్దంలో, మూడవ శతాబ్దంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఏమి నేర్పించాడో దానిని నిర్లక్ష్యం చేస్తాయి.
సంఘ చరిత్రను అధ్యయనం చేసినప్పుడు వారి విశ్వాసతను బట్టి మనం ఎంతో ప్రేరేపించబడతాం, ప్రోత్సహించబడతాం, అంతకంటే ఎక్కువగా దేవుడు తన ప్రజల పట్ల చూపిన ఉన్నతమైన విశ్వసనీయత, ప్రణాళిక , కాపుదల, భద్రతలు మనల్ని విశ్వాసజీవితంలో ఎంతో ప్రోత్సహపరుస్తాయి.
ఇది మన విశ్వాస జీవితాన్ని ఎంతో బలపరుస్తుంది. అలాగే, సంఘ చరిత్రలో పురుషులు మరియు స్త్రీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు వాటి నుంచి మనం ఎంతో నేర్చుకోవలసిన వారిగా ఉన్నాం. ఇంతమాత్రమే కాకుండా ఆ చరిత్రను మనం తెలుసుకోవడం ద్వారా వారిలో కొందరు చేసిన పొరపాట్లు మనం చెయ్యకుండా , తప్పుడు బోధలకూ, బోధకులకూ చెవియొగ్గకుండా మనల్ని మనం జాగ్రత చేసుకుంటాం.