సంఘం అనగానే మనకి చర్చి బిల్డింగ్ లేదా ప్రతి వారం వెళ్ళి ఆరాధించే ఏదోఒక స్థలం జ్ఞాపకం వస్తుంది. క్రైస్తవులుగా మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే స్థలాన్ని వివరించడానికి “సంఘం” అనే పదాన్ని సాధారణంగా ఉపయోగిస్తాము. దీనిలో అంతపెద్ద పొరపాటేమీ కనిపించనప్పటికీ “సంఘం” అనే పదానికి మనకున్న ఈ అవగాహన వాక్యానుసారమైనది కాదు.
నూతననిబంధన మూలభాష అయిన గ్రీకులో ‘ఎక్లేసియా’ అని రాయబడ్డ పదానికి మన బైబిళ్ళలో చర్చి లేదా సంఘం అని తర్జుమా చేసారు. ‘ఎక్లేసియా’ అనే మాటకు సమూహము, లేదా పిలవబడిన వారి సమూహము అని అర్థం వస్తుంది, అంతే కానీ సంఘం అంటే, బిల్డింగ్ కాదు, ఒక స్థలమూ కాదు. ఈవిధంగా సంఘం అంటే మనుషులు.
క్రొత్త నిబంధనలో అంతటిలోనూ ఈ అవగాహనే మనం చూస్తాం.
అపొస్తలుల కార్యాలు 15: 4 వచనంలో , వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నియు వారు వివరించిరి, అని రాయబడింది
ఈ వచనంలో, అపోస్తుల కార్యాలు రాసిన రచయిత సంఘంలో ఉన్న అపోస్తులను, పెద్దలను అనకుండా ‘వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును’ అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి అని స్పష్టంగా రాస్తున్నాడు.
అపొస్తలుల కార్యములు 18: 22 తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను. ఈ వచనంలో కూడా పౌలు యెరూషలేముకు వెళ్ళి సంఘపువారిని కలిసి తరువాత అంతియొకయకు వెళ్లినట్టుగా రాయబడింది.
ఈ విధంగా సంఘం అంటే, మనం ప్రతీ ఆదివారం వెళ్ళే నిర్మాణమో, స్థలమో కాదు.
సంఘం అంటే రక్షణ నిమిత్తం కేవలం యేసు క్రీస్తు మీద విశ్వాసముంచిన ప్రజలే అని వాక్యం తెలియచేస్తుంది. ఈ సంఘానికి క్రీస్తే అధికారి.