ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది మత్తయి 13:33
యేసుక్రీస్తు ఈలోకంలో జీవించిన కాలంలో ప్రజలతో ఆయన ఉపమానాల రీతిలో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడేవారు.
ఒక రోజు ఆయన ఇంటినుండి వెళ్ళి సముద్రతీరం దగ్గరున్న ఒక పడవలో కూర్చుని చుట్టూ గుమిగూడిన పెద్ద సమూహంతో ఉపమానాలు చెప్పసాగాడు. అందులో కొన్నిటికి ఆయనే భావాలు వివరించాడు కొన్నిటికైతే వివరించలేదు.
పరలోకరాజ్యము ఎలా ఉంటుందో చెప్పే నేపధ్యం లో చాలా ఉపమానాలు ఆయన చెప్పాడు. వాటిలో ఒకదాన్ని మత్తయి 13:33 లో మనం చూస్తాం. ఈ ఉపమానాన్ని ప్రసంగీకులు పలు రకాలుగా వివరిస్తుంటారు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే సందర్భం ఎంతో ప్రాముఖ్యం.
మత్తయి 3:31,32 లో, పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానంగా, అది పొలములో విత్తిన ఆవగింజను పోలియుందని , అది పెరిగి ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించు పెద్దదిగా ఔతుందని చెబుతాడు.
అంటే దేవుని రాజ్యం మొదట చిన్నదిగా మొదలైనప్పటికీ, క్రమంగా అది ఆత్మీయంగా విస్తరిస్తుందని అర్థం.
దాని తర్వాతే ఆయన పులిసిన పిండిని గూర్చిన ఉపమానం చెబుతున్నాడు. బైబిల్ లో, సాధారణంగా పులిసిన పిండి అనగానే నెగిటివ్ అర్థాన్ని వివరిస్తుంది. ఉదాహరణకి ,
1 కొరింథీ 5:5-8
మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.
గలతి 5:7-9
మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధే యులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును.
పై లేఖనాలవలే, మనం మాట్లాడుకుంటున్న ఉపమానంలో కూడా పులిసిన పిండి అనగానే నెగటివ్ అర్థం వచ్చేలా కనిపిస్తుంది, కానీ మనం సందర్భానుసారంగా దాన్ని అర్థం చేసుకుంటేమాత్రం పాజిటివ్ గా పేర్కోబడిందని స్పష్టమౌతుంది.
ఆ పులిసిన పిండి కొంచెముగా వేసినా , వంద మంది తినడానికి సరిపోయే రొట్టెలుగా ఎలా పిండి అంతటినీ పులియబెట్టిందో అదేవిధంగా, దేవుని రాజ్యముకూడా చిన్నదిగా మొదలయ్యి ఎంతగాబో ప్రభావితం అవుతుందని, ఆ ఉపమానం ద్వారా ఆయన బోధిస్తున్నాడు.
క్రైస్తవుడా! నీవు చేసే పరిచర్య వేగంగా వృద్ధిచెందినట్లుగా నీకు కనబడకపోతే నిరుత్సాహపడకు. అది సంఘ పరిచర్యయైనా కావొచ్చు, గృహ నిర్వహణయైనా అవ్వొచ్చు. నీవు ఎక్కడున్నా, నీవు చేస్తున్న పనులలో నమ్మకంగా ఉండు.( కొలొస్సయులకు 3:24). దాని సమయంలో దానికి ఫలితం తప్పక లభిస్తుంది. మీ చుట్టుపక్కల ప్రజల దృష్టికి మీరు చేసే పని చిన్నదిగా కనిపించవచ్చు, లేదా అసలు కనపడకపోవచ్చు కానీ దేవుడు, తనరాజ్య విస్తరణలో భాగమైనందుకు మీకు ప్రతిఫలమిస్తాడు. చర్చిలో సువార్త పత్రికలను పంచే స్వచ్ఛంద సేవకులుగా మీరు ఉండవచ్చు, ఈ సేవ ద్వారా ఎవరూకూడా నేను నువ్వు ఇచ్చిన పత్రికద్వారా క్రీస్తును నమ్ముకున్నాని చెప్పకపోవచ్చు, కానీ ఎదోవిధంగా, చేరవలసిన వాళ్ళకి అది చేరవచ్చు. మీ సేవ కొనసాగించండి. మీరు మీ పిల్లలకు ప్రభువు మార్గాలను నేర్పడానికి ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు కావచ్చు కానీ పిల్లల హృదయంలో మార్పు ఏమీ చూడకపోవచ్చు. అయినా కూడా మీ సేవ కొనసాగించండి.
మీ చర్చిలో సంఖ్య పెరగట్లేదని కలత చెందకండి, మీరు వాక్యానుసారమైన బోధను విశ్వాసంగా కొనసాగించండి. మనం చేసే చిన్న విషయాలు ప్రభువు రాజ్యంపై మరింత ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతాయి. కనుక అలియక, వేసారక మీ సేవను క్రీస్తు కొరకు కొనసాగించు.