Home » మరణం తర్వాత ?

మరణం తర్వాత ?

ఆయనొక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారుడు. ఒలింపిక్స్ లో అమెరికా జట్టు తరపున రెండు సార్లు స్వర్ణం సాధించి ఎన్బీఐ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన క్రీడాకారుల్లో నాల్గో వ్యక్తిగా రికార్డులు సృష్టించారు. కోట్ల రూపాయల ఆస్తి గల సంపన్నుడు. ఆ వ్యక్తి పేరు కోబ్ బ్రయాంట్.

బాస్కెట్ బాల్ ఆటలో ఎన్నో అవార్డులు ఆయన సొంతం.ప్రపంచం ఆయన్నొక సూపర్ స్టార్ గా చూసింది. 2016లో బాస్కెట్ బాల్ క్రీడకు గుడ్ బై చెప్పిన తర్వాత వ్యాపారం, ఎంటైర్‌టైన్‌మెంట్ రంగాలపై బ్రయాంట్  దృష్టి సారించారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం బ్రయాంట్ రిటైర్ అయ్యేనాటికి ఆయన ఆదాయం సుమారు 77 కోట్ల డాలర్లు (రూ. 5,500 కోట్లు).డబ్బుకు ఏ మాత్రం కొదవలేని వ్యక్తి. 2018లో డియర్ బాస్కెట్ బాల్ పేరిట ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డును అందుకుంది.పేరు ప్రఖ్యాతలకు కూడా కొదువలేదు. కానీ అకస్మాత్తుగా తన రెండో కూతురు ఇతర బృందంతో ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ కొండను ఢీకొనడం వలన మృతి చెందాడు.ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు.

మరణం

ఎప్పుడొస్తుందో తెలియదు. ఎలా పలకరిస్తుందో తెలియదు. పేద, ధనిక తేడా లేదు. కుల మత  బేధాలు లేవు. అకస్మాత్తుగా హరించి వేస్తుంది. ఎంత డబ్బున్నా, ఎంతో పేరు సంపాదించుకున్నా ఎన్నెన్నో మంచి పనులు చేసినా ఒక క్షణాన మృత్యువు ఒడికి చేరాల్సిందే. 

కొంతమంది ఇష్టపడకపోయినప్పటికీ నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను,  ” ఈ భూమ్మీద మనం జరుపుకునే ప్రతి పుట్టినరోజు, మనలను మన మరణ దినానికి దగ్గరగా తీసుకెళ్తుంది”. మనిషికి మరణం తప్పదని ఆ సత్యాన్ని ఒప్పుకోక తప్పదని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 

మరణం తర్వాత ? 

జీవం లేని శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ విడువబడగానే మన పేరు పెట్టి పిలవరు గాని, శవం అని పిలుస్తారు. అంటే ఆత్మను బట్టే మనిషికి విలువ అని అర్థమౌతుంది. 

ప్రశ్నేమిటంటే, ఆత్మ ఎక్కడికి వెళుతుంది? 

ఓ చారిత్రక గ్రంథం మనిషికి ఆత్మను దయచేయువాడు దేవుడే అని చెబుతుంది.అవును దేవుడే ఆత్మను అనుగ్రహించి మానవున్ని సృష్టించాడు.  అయితే, పాపం చేత దేవునికి అవిధేయుడైన మనిషి పాప ఫలితమైన నిత్య మరణానికి ప్రాప్తుడై, నరకానికి పయనిస్తున్నాడు.  పాపం చేత మలినమైన మనిషి ఆత్మను పవిత్రుడైన దేవుడు అంగీకరించలేడు. ఎందుకంటే దేవుడు నిర్వచనం ప్రకారం పాపాన్ని అసహ్యించుకునే పవిత్రుడు. 

ఈ లోకంలో ఎంత డబ్బున్నా, పేరున్నా, పెద్ద పదవిలో ఉన్నా, సత్క్రియలు ఎన్నో చేసినా ప్రతి మనిషి కూడా, దేవుని ప్రామాణికతలకు, ఆజ్ఞలకు లోబడక దేవునికి విరోధంగా పాపం చేస్తున్నవాడే అనే సత్యం అంగీకరించాల్సిందే.  దేవుడు నీతి న్యాయములు కలవాడు కాబట్టి, ఆ పాపాన్ని బట్టి వారిని శిక్షించాల్సిందే. 

శుభవార్త 

తన మహిమ  కొరకు సృష్టించుకున్న మనిషి పాపములో నశించుటకు  ఇష్టపడని ప్రేమ గల దేవుడు, మానవునిగా ఈ భూమిపై జన్మించాడు. వెల చెల్లించకుండా పాపమునకు విడుదల లేదు కనుక పాపులైన ప్రజల నిమిత్తం యేసు క్రీస్తు ప్రభువు మరణానికి తనను తాను అప్పచెప్పుకున్నాడు. మానవ పాపములను వాటి ఫలితమైన దేవుని ఉగ్రతను సిలువలో భరించి, మానవ శిక్షను ఆయన అనుభవించాడు. 

తనను నమ్మినవారిని , పాపమునుండి, శాపము నుండి విడుదలనిచ్చుటకై అతి ఘోరంగా సిలువలో మరణించాడు.  అంతే కాక మూడవ దినమున మరణము జయించి తిరిగి లేచాడు. 

ఎవరైతే యేసుక్రీస్తు వద్దకు వచ్చి, తమ పాపాలు ఒప్పుకొని, ప్రాయశ్చిత్త మనసుతో ఆయనయందు విశ్వాసముంచుతారో వారిని నిత్యనరకము నుండి తప్పించి, ఆత్మీయ మరణము నుండి రక్షించి, నిత్య జీవము అనుగ్రహిస్తానని, తన వాక్యమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సెలవిచ్చాడు. ఆత్మ దానిని దయచేసిన దేవునియొద్దకు చేరాలంటే, శరీరములో ఉన్నపుడే పాపక్షమాపణ పొందుకోవాలి.

ఎప్పుడు చావును చేరుకుంటావో తెలియని స్థితిలో ఉన్న సోదరా, సోదరి నీ గురించే యేసుక్రీస్తు ఈ మాటలన్నారు “ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? “

నీ ప్రాణాన్ని కాపాడే ప్రభువును ఎరిగి, విశ్వసించి ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆశిస్తూ……

దేవుని కృపతో రక్షించబడి, నా భార్య మేరీకి భర్తగా, అలిత్య, ఆవియా, ఆబ్డియేల్ అనే మా పిల్లలకు తండ్రిగా, Ekklesia Evangelical Fellowship అనే స్థానిక సంఘ సహా సంఘపెద్ద/కాపరిగా సేవ చేస్తున్నవాడను.

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.