దేవుని ఆరాధనకు సంబంధించిన సూత్రాలు
మనము అనగా సంఘము దేవుడిని ఏ విధంగా మహిమ పరుస్తున్నాము అనే విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. అందుకే మనము ఆయనను ఏ విధంగా మహిమ పరచాలో బైబిల్ లో మన కొరకు రాయించాడు. మనము మనకు ఇష్టం వచ్చినట్లు దేవుడిని మహిమ పరచడానికి వీలు లేదు. ఆయనను ఏ విధంగా ఆరాధించాలో బైబుల్లో ఆయన కొన్ని సూత్రాలని, విధానాలని మన కొరకు రాయించాడు.
ఆరాధన అంటే ఏమిటి?
ఆరాధన అనగా దేవుడు మనకిచ్చిన నియమ నిబంధనలను జాగ్రత్తగా పాటించడం ద్వారా దేవునిని మనము మహిమ పరచడం.
ఆరాధన మన విశ్వాసాన్ని తెలియజేస్తుంది
మనము ఏ విధంగా ఆరాధిస్తున్నాము అనేది మనము ఎవరిని ఆరాధిస్తున్నాము అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి గురించి ఎంత ఎక్కువగా మనము నేర్చుకుంటే అంత ఎక్కువగా ఆయనతో స్నేహంలో ఎదుగుతాము.
అలాగే దేవుని గురించి నీవు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా ఆయన నీవు ఆరాధించగలుగుతావు, ఆయనతో సహవాసంలో ఎదుగుతావు.
దేవుని ఆరాధనలో క్రమం లేకపోతే దాని ఫలితాలు
ఆయన ఇచ్చిన క్రమములో మనము ఆయనను ఆరాధించకపోతే ఏం జరుగుతుంది?
- లేవీయకాండము 10:1-3 లో నాదాబు అభిహులు యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగా యెహోవా వారిని కాల్చివేశాడు అనే విషయాన్ని మనము చూస్తుంటాం.
- ఆదికాండం 4 లో కయీను యెహోవా చిత్తానుసారంగా అర్పించనందుకు ఆయన ఆ అర్పణను స్వీకరించలేదు.
- అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 5 వ అధ్యాయంలో సంఘము ద్వారా జరుగుతున్నటువంటి కార్యముల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతున్నప్పుడు అననీయ మరియు సప్పీరాతో సంఘమును మోసపరిచి దేవునిని హృదయపూర్వకంగా ఆరాధించనందుకు వారిని శిక్షించాడు. మనము సంఘముగా కూడి ఆయనను ఆరాధించేటప్పుడు జాగ్రత్తగా ఆరాధించాలి. వాక్య ప్రమాణాలతో దేవుడు కోరుకున్నటువంటి ఆరాధనని మనము చేయాలి.
ఆరాధనలో పాల్గొనే ఇతర మార్గాలు
ఆరాధన అనగా సంఘము సహవాసానికి కూడుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ, అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా పాటలు పాడే ఆ యొక్క పది నిమిషాల సమయాన్ని ఆరాధన అని మనము పిలుస్తూ ఉంటాము. కానీ ఆరాధన అనగా సంఘముగా కూడి మీరు చేసేటువంటి ప్రార్థన,పాటలు పాడడం, వాక్యము చదవడం, వాక్యాన్ని ప్రకటించడము, వాక్యాన్ని వినడము, కానుకలు సమర్పించడము, ప్రభు బల్ల బాప్తిస్మములను ఇవ్వడం, మన తోటి సహోదరి సహోదరులతో సహవాసం చేయడము ఇదంతా కూడా ఆరాధనలో భాగమే. అంతేకాదు ఆదివారము మన సంఘ ఆరాధన అయిపోయిన తర్వాత మిగతా ఆరు రోజుల్లో నీవు జీవించేటువంటి జీవితం అంతా కూడా దేవునికి ఆరాధనగా నీవు బ్రతకాలి.
మలాకీ గ్రంథం లో ఆరాధన
మలాకీ 1:6
కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.
మలాకీ 1:7
నా బలి పీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా!
అసలైన ఆరాధన లేదా విగ్రహారాధన?
దేవుడు మనల్ని నాకు రావాల్సిన మహిమ ఏమాయెను అని అడిగితే చాలామంది చెప్పే సమాధానం ఏమిటంటే, దేవా! ఏమి చేసి నీ నామమును మేము నిర్లక్ష్యం చేసాము? నిన్ను ప్రతి ఆదివారం మేము హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాను గట్టిగా చప్పట్లు కొడుతూ,గట్టిగా పాటలు పాడుతూ, నానా విధములైన వైద్యాలతో ఎంతో శబ్దంతో, రంగురంగు వెలుగుల నిచ్చే లైట్స్ సెట్టింగ్స్ తో, అందమైన బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ తో, లేటెస్ట్ స్టెప్పులతో నాట్యమాడుతూ నిన్ను ఆరాధిస్తున్నాము నీకు తెలియదా దేవా అని అంటూ ఉంటారు.
దానికి దేవుడనే సమాధానం ఎవరైనా మీ యొక్క సంఘ భవనపు తలుపులు మూసిన యెడల అది మేలు అని అంటాడేమో!
సత్యమయిన ఆరాధనకు పిలుపు
దయచేసి, ప్రియమైన సంఘమా, సంఘ కాపరులారా, సంగీతమును నడిపించే నాయకులారా, దయచేసి మీ ఆరాధన దేవుడు ఆశించిన రాయించిన విధంగా ఉందా లేదా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా ఆరాధించి దేవుని నామాన్ని మహిమ పరుస్తారు అని ఆశిస్తూ ఈ మాటలని మీకు రాస్తున్నాను.