COVID-19 కారణంగా, ప్రతి ఒక్కరూ హఠాత్తుగా అంత్య దినాలగురించి అధ్యయనం చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు; వాటిని, అధ్యయనం చేయడం మరియు ధ్యానించడం మంచిదే అయినప్పటికీ, ముఖ్యమైన వాటి గురించి మరచిపోకూడదు.
క్రీస్తు రెండవ రాకడ, శ్రమలు, దానికి సంబంధించిన అన్ని సంఘటనలను జాగ్రత్తగా అధ్యయనం చేయడం యేసుపై నమ్మకం ఉన్నవారికి మాత్రమే సంతోషాన్ని కలిగిస్తుంది. వీటిని చదవకూడదని నేను మిమ్ములను నిరుత్సాహ పరచడంలేదు కానీ మనం నిజంగా క్రైస్తవులం అవునో కాదో మనకు తెలియకపోతే అది పనికిరాని ప్రయత్నమే కానీ దేనికి ప్రయోజనం ఉండదు.
“మారుమనస్సు పొందావా ” అన్నది మంచి ప్రశ్న; సాధారణంగా ఎవరితో అయినా సంభాషించేటప్పుడు , సువార్తను అందించే క్రమంలో, ఈ ప్రశ్న ఇతరులని అడుగుతాము. చాల సందర్భాలలో అడిగే వ్యక్తి మారుమనస్సు అనుభవం ఉన్నవాడే కనుక ఈ ప్రశ్న అడగడం సులువు; కానీ అదే ప్రశ్న తనకు తాను వేసుకోవడం చాల కష్టమైన క్రియ.
ఒకసారి మనకు మనము ఈ ప్రశ్నని వేసుకుందాం; నేను కూడా ఈ ప్రశ్న నాకు నేనుగా వేసుకున్నాను. ఆ సమయంలో అది నాకు చాల కష్టంగా అనిపించింది,కానీ ఇది ఒక అద్భుతమైన ప్రశ్న; ఇది మీ ఆత్మకు మంచిది, ఇది మమ్మల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామా అని పరిశీలించుకోడానికి సహాయపడుతుంది; మనం క్రీస్తుని నిజంగా ప్రేమిస్తున్నామో లేక వేషధారణ జీవితాన్ని గడుపుతున్నామో చూడటానికి ఇది సహాయపడుతుంది.
మనమంతా, ప్రార్థన చేయడం, క్రమం తప్పకుండా బైబిల్ చదవడం, చర్చికి వెళ్లడం వంటి క్రైస్తవ క్రమశిక్షణ పద్దతులు పాటించడం మంచిదే;
కానీ, ఇవి చేసినంత మాత్రాన మనము క్రైస్తవులము అనుకోవడము పొరపాటే. సంఘానికి వచ్చే చాలామంది ఇవన్నీ చేసేవారు ఉంటారు కానీ, వారిలో మారుమనస్సు పొందనివారు కూడా ఉంటారు; నేను కూడా ఒకప్పుడు ఈ గుంపుకు చెందినవాడినే.
బైబిల్ చాల స్పష్టముగా దేవుని ప్రేమించిన వారు అయన ఆజ్ఞలను అనుసరిస్తారు అని చెప్తుంది ( యోహాను 14:15).
ఓ విశ్వాసి, నీవు దేవుని ఆజ్ఞలపై దృష్టి పెడుతున్నావా? పాపాన్ని ద్వేషించి , క్రీస్తు వైపు తిరుగుతున్నావు లేదా, నీ సొంత నీతిని ఆధారం చేసుకుంటున్నావా? నీ మార్గాలు స్వచ్ఛమైనవిగా ఉన్నాయా? ఇతరులను ప్రేమిస్తున్నావా? మీ సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ లెక్కపెడుతున్నావా? క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మనము కలిగిఉంటున్నామా ? క్రైస్తవుడు ఎప్పుడూ పాపం చేయడు అని నేను అనడం లేదు, కానీ మనము దేవుని పట్ల పాపం చేసినప్పుడు, మనము పశ్చాత్తాపపడి మన మార్గాన్ని మార్చుకుంటున్నామా ? ఇవన్నీ “నేను మారుమనస్సు పొందానా?” అనే ప్రశ్నలో ఇమిడి ఉన్నాయి.
నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు
1 యోహాను 2:1
ఈ వ్యాసాన్ని చదివినవారందరు ఈ ప్రశ్న వేసుకొని , నిజాయితీగా స్వీయపరిశీలన చేసుకోమని విజ్ఞప్తిచేస్తున్నాను. మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?
2 కొరింథీయులకు 13:5
మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము
విలాపవాక్యములు 3:40
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును
1 యోహాను 1:9