ఫీనెహాసు వయసు 30 కంటే ఎక్కువ ఉండదు, ఆహారోను మనవడు, మోషే మరియు అహరోను ఇద్దరూ అన్నదమ్ములు, ఇశ్రాయేలు చేస్తున్న పాపం వల్ల దేవుడు పంపిన తెగుళ్ళకు అనేక మంది చనిపోతున్నారు. ఆ సమయంలో జిమ్రి అనేవాడు ఆ తెగులు ఎక్కువ అవ్వడానికి కారణం అవుతున్నాడు, పట్టపగలే అందరి ముందు ఒక స్త్రీని తీసుకువెళ్లి వ్యభిచారం చేస్తున్నాడు. ఆ సమయంలో ఫీనెహాసు:
- నాకెందుకు? దేవుడు తీర్పు తీరుస్తాడు అని అనుకోలేదు.
- మోషే లాంటి గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు నేను వెళ్లి చంపితే అది సబబు కాదేమో అని అనుకోలేదు. వ్యభిచారం అనే పాపం చేస్తున్న వాడు మోషే కన్నుల ఎదుటనే చేస్తున్నాడు. కాబట్టి మోషేనే మౌనంగా ఉన్నప్పుడు నేను వాడిని చంపడం కరెక్ట్ కాదేమో అని అనుకోలేదు, వాడిని చంపాలా వద్ద అని మోషేను కూడా అడగలేదు.
- దేవుడు ఆ పాపాన్ని అనుమతించాడు కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఖండించకూడదు అని అనుకోలేదు.
- అయినా పాపం చేస్తున్నది వేరే జాతి వాడు కాదు కదా ఇశ్రాయేలు వాడే కదా అని అనుకోలేదు.
- మన జాతి వాడినే చంపితే దేవుడి నామానికి అవమానం కదా అని అనుకోలేదు.
కానీ ఫీనెహాసు:
- బయట శత్రువుల కంటే లోన శత్రువులు అత్యంత ప్రమాదకరమని గుర్తించాడు.
- బయట శత్రువులు భౌతికంగా మాత్రమే మనల్ని గాయపరుస్తారని కానీ లోపటి శత్రువులు ఆత్మీయంగా దేవునికి దూరం చేస్తారు, దేవుడి నామం అన్యజనులు ముందు దూషింపబడడానికి కారణం అవుతాయని గుర్తించాడు.
- దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళ్తున్నప్పుడు, నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాలి అని గుర్తించాడు.
- వాక్య ప్రకారం తీర్పు తీర్చడానికి దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడని గుర్తించాడు (Eph 5:11).
- మన జాతి వాడే అని “ప్రేమ” అనే పేరుతో వదిలేస్తే వాడు ఈ పాపంలోకి మిగతా వారిని నడిపిస్తాడు అని గుర్తించాడు.
- క్రియలు లేని విశ్వాసం మృతం అని గుర్తించాడు.
ఇక ఆలస్యం చేయలేదు, ఎవర్ని సంప్రదించలేదు, పక్కనే ఉన్న ఈటెను తీసుకొని వెళ్ళి జిమ్రి ని చంపడం వల్ల తెగులు ఆగిపోయింది (సంఖ్యా కాండం 25:8). అగ్నిలో నుండి కొంతమందిని లాగినట్టు బయటికి లాగాడు. చాలామంది జిమ్రి ని చంపడం ఒక్కటే చూశారు కానీ, వాడిని చంపడం వల్ల అనేక మంది బతికారు అనేది గమనించలేదు.
అతడు దేవుని పట్ల చూపిన రోషాన్ని బట్టి దేవుడు అతని గురించి తరతరాలు గుర్తు పెట్టుకునే లాగా అద్భుతమైన మాటలు చెప్పాడు, “నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వ లేడు, నా విషయమై ఆసక్తి గలవాడు అని… జీవ గ్రంథంలో అతని పేరు లిఖించబడింది…”
ఫీనెహాసు లాగా మనం చంపాల్సిన అవసరం లేదు కానీ, ఆయన లాగా దేవుని పట్ల రోషం కలిగి దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళుతున్న ప్రతిదాన్ని ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలంటే ఇది ఒక గొప్ప యుద్ధమని గుర్తించాలి…