బైబిల్ అంతా దేవుని వాక్యమే

క్రైస్తవ సంఘ చరిత్రను మనం పరిశీలించినప్పుడు సంఘంలోకి దుర్బోధలు ప్రవేశించడం కొత్త విషయమేమీ కాదని మనకు అర్థం ఔతుంది. అలా ప్రవేశించిన అనేక దుర్భోధల్లో కొన్ని ఇప్పటికీ సంఘంలో కొనసాగుతూనే ఉన్నాయి మరికొన్ని కొత్తకొత్త దుర్భోధలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
క్రైస్తవులంగా మనం సత్యమైన (వాక్యానుసారమైన) బోధలను మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలి. అలా అంటిపెట్టుకుని ఉండడానికి నేటి సంఘాలలో చేయబడుతున్న బోధలలో ఏది సత్యమైన బోధ, ఏది దుర్బోధ అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ విశ్వాసిపైనా ఉంది.

నేడు చాలామంది క్రైస్తవులు అసత్యమైన బోధలకు ఆకర్షితులై తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. వారి హృదయాలలో అదే నిజమని ఎంతో రూఢిగా నమ్ముతూ దానినే అనేకులకు‌‌ ఎంతో నమ్మకంగా  బోధిస్తున్నారు.వారు చెప్పే బోధను వినేవారంతా అది నిజమేనేమో అనుకునేంత‌ చక్కగా బోధిస్తున్నారు. ఇలాంటి వారి గురించీ వారు సంఘానికి‌ కలిగించే నష్టం గురించీ అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయకుమారుడైన తిమోతీని హెచ్చరిస్తూ అటువంటి బోధలకు దూరంగా ఉండమని చెబుతాడు.

1 తిమోతి 6:3-11
ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైనబోధనుపదేశించినయెడల వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురను మానములును,చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి. నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము.

అలాంటి బోధలలో   “బైబిల్ అంతా దేవుని వాక్యము కాదనే” ఒక దుర్బోధ మనకి తెలియకుండానే మన మధ్య సంచరిస్తుంది; ఇది సంఘంలో చాలా చురుకుగా వ్యాపిస్తుంది.
ఇంతకూ ఈ దుర్బోధ ఏం బోధిస్తుంది? దీనిని‌ బోధించేవారు ఏం నమ్ముతారు?

క్రైస్తవునిగా చెప్పుకునే వారు ప్రతిఒక్కరూ కూడా, బైబిలోని ప్రతీ పుస్తకం‌ ప్రతీ అక్షరం  దేవుని వాక్యంగా పరిగణిస్తారు కానీ వీరు ఈ సత్యాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారు.
వీరు పాత నిబంధనలో ఎక్కడైతే  ఇది యెహోవా వాక్కు (యెషయా 7:7, ఆమోసు 1:3, ఓబద్యా 1:1, మీకా 2:3) అంటూ రాయబడ్డ, లేక యెహోవా దేవుడే స్వయంగా, ప్రత్యక్షంగా  మాట్లాడిన మాటలు మాత్రమే దేవుని వాక్యమనీ,  అలాగే కొత్త నిబంధనలో, యేసు క్రీస్తు పలికిన మాటలు వరకే దేవుని వాక్యంగా పరిగణించాలనీ బోధిస్తున్నారు. 

ఇది చాల ప్రమాదకరమైన బోధ మాత్రమే కాకుండా ఇది వాక్య విరుద్ధమైన బోధ. వీరు 66 పుస్తకాలు దేవుని వాక్యమని ఎంతమాత్రం విశ్వసించరు. వారికి కేవలం యేసుక్రీస్తు పలికిన మాటలు , లేదా యెహోవా దేవుడు పలికిన మాటలే ప్రమాణం. మిగిలిన మాటలేవీ వారికి ప్రామాణికం‌‌ కాదు. ఈ నమ్మకానికి వెనుక వీరికి ఒక ప్రధానమైన ప్రశ్న, సంశయం దాగి ఉందని‌ మనం గుర్తించవచ్చు. అసలు బైబిల్ గ్రంథకర్త  దేవుడా లేదా మానవులా? అనే ప్రశ్నకు మనం జవాబుని  తెలుసుకోగలిగితే ఇలాంటి బోధల నుండి మనల్నీ, మన సంఘాలనీ రక్షించుకోవచ్చు.   ఈ సమస్య గురించి బైబిల్ చాలా స్పష్టతను ఇస్తుంది. దీనిగురించి చెప్పే సిద్ధాంతాన్ని ప్రేరణ సిద్ధాంతం అంటారు.
దేవుడు తన వాక్యాన్ని ఏ రీతిలో మనకు అందచేశాడో దాని గురించి తెలియచేసేదే ఈ ప్రేరణ సిద్ధాంతం.

1 తిమోతి 3:16-17 లో, దేవుని వాక్యమంతా దైవావేశం వల్ల కలిగినదని స్పష్టంగా రాయబడింది.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.

బైబిల్ లో 66 పుస్తకాలకీ మానవ రచయితలు ఉన్నారనేది మనకి తెలిసిన విషయమే. అయితే వారు రచించిన ఆ రాతలు దేవుని వాక్యం ఎలా ఔతుందో తిమోతీ పత్రికలో చెప్పబడిన  దైవావేశం అన్న పదాన్ని  బట్టి అర్థం చేసుకోగలిగితే మనకు దీనిపై స్పష్టత వస్తుంది.  బైబిల్ రచించిన వారు వారి శైలిలో, వారి వ్యక్తిత్వాన్ని బట్టి , వారు చూసిన, విన్న  విషయాలనే రాసారు. వారు రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి రాతలమీద అధికారం గలవాడై, తన పర్యవేక్షణలో, ప్రేరణతో తాను ఉద్దేశించిన మాటలను, అదే రీతిలో ఎటువంటి మానవ తప్పిదానికీ చోటులేకుండా రాయించాడు.

ఇక్కడ మనం బైబిల్ ( 66 పుస్తకాలు) లో ఉన్న ప్రతీపదం కూడా దైవావేశం వల్ల కలిగినదని గ్రహించాలి. అంటే, రచయితలు రాసిన రాతల్లో ప్రతీ పదం కూడా దేవుడు ఉద్దేశించిన ఖచ్చితమైన పదం. కాబట్టి బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణతో (దైవ ప్రేరితమైన) గ్రంథకర్తలచే రచింపబడ్డ పరిశుద్ధ గ్రంథం.

జెకర్యా 7: 12
ధర్మశాస్త్రమును, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను, తాము వినకుండు నట్లు హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిరి.

రెండవ పేతురు 1:20,21
ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

ఉదాహరణకు,  95వ కీర్తన దావీదు రాసిన కీర్తన అని మనకు తెలుసు. అదే కీర్తనను  వందల సంవత్సరాల తర్వాత హెబ్రీ గ్రంథకర్త తన పత్రిక 3:7లో ఉదాహరిస్తూ పరిశుద్ధాత్మ ఇలా చెబుతున్నాడ‌ని అందులోని 8-11 వచనాలను ప్రస్తావిస్తాడు. అక్కడ అతను పరిశుద్ధాత్మ ఇలా చెబుతున్నాడు అంటున్నాడే తప్ప దావీదు అని అనడం లేదు.
దీనిని‌ బట్టి మొదటి శతాబ్దంలోనే యూదులూ మరియు సంఘం పాత నిబంధన అంతా దేవుని వాక్యమని నమ్మేవారని మనకి స్పష్టమౌతుంది.  ఇది బైబిల్ యొక్క ద్వంద్వ గ్రంథకతత్వాన్ని నిరూపిస్తుంది. అంటే బైబిల్ గ్రంథకర్తలు ఇద్దరు, దేవుడు మరియు మనుషులు. అందుకే కొన్నిసార్లు పాతనిబంధన లేఖనాలను కొత్తనిబంధన గ్రంథకర్తలు ఉటంకించేటపుడు పైన హెబ్రీ గ్రంథకర్త చెప్పినట్టు పరిశుద్ధాత్ముడి పేరు ప్రస్తావిస్తే మరికొందరు ఆ గ్రంథకర్త పేరు ప్రస్తావించారు. అక్కడ గ్రంథకర్త పేరును మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడి పేరును కూడా ప్రస్తావించారంటే ఆ గ్రంథకర్తల రచనల వెనుక ఉన్నది పరిశుద్ధాత్ముడే.

కాబట్టి; బైబిల్ లోని  66 పుస్తకాలలో ఉన్న  ప్రతీ మాట దేవుడు ఉద్దేశించి మాట, అది నిశ్చలమైన పరిశుద్ధ దేవుని వాక్యం.

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.

EP 01 : Introduction

Welcome to life and Scripture: Discovering God’s truth for everyday living. Welcome to the very first episode of Life and Scripture ! I’m...