తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలూ సమూయేలూ, అని పిలువగా సమూయేలునీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను.
1 సమూయేలు 3:10
దేవుడు ఈ రోజుల్లో కూడా ఇలా ప్రత్యక్షమైతే ఎంత బాగుంటుంది కదా? కొంతమంది, వారు దేవునితో మాట్లాడుతున్నామని, దేవుడు నాకు ఇలా చెప్పాడని, మీకు ఇలా చెప్పమన్నాడని అంటుంటారు. అవన్నీ కేవలం వారి మనసులో ఉన్న భావాలు మాత్రమే తప్ప, నిజంగా దేవుడు చెప్పిన మాటలు కావు.
ఆ రోజుల్లో దేవుని వాక్యము అరుదుగా ఉండడం వలన దేవుడు తన్నుతాను ప్రత్యక్ష పరచుకున్నాడు. ఒకసారి మీరు సమూయేలుగా ఊహించుకోండి. ఏలీ దగ్గర పరిచారము చేయడానికి మీ తల్లితండ్రులను వదిలి వచ్చావు. విశ్వాసముతో దేవుని పరిచర్య చేస్తున్నావు. ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు చేస్తున్న ఘోరమైన పనులు గురించి విని ఏమి చేయలేని పరిస్థితి. ఒకరోజు గాఢ నిద్రలో ఉన్నపుడు నీ పేరు పెట్టి దేవుడు పిలిచినప్పుడు, ఏలీ పిలిచారేమో అనుకుని వెళ్లి, నేను పిలవలేదని ఏలీ అన్నపుడు నువ్వు ఎలా స్పందించియుంటావో కదా? అదీ ఒక్కసారి కాదు మూడు సార్లు. నేనైతే భయపడేవాడిని.
ఆ రోజుల్లో దేవుని వాక్యము అరుదుగా ఉండడం వలన అసాధారణ రీతిలో సమూయేలుతో ఆయన మాట్లాడారు. కానీ ఈ రోజున , దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడెనని వాక్యము చెప్తుంది.
హెబ్రీ 1:1
పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు. అని 1 సమూయేలు 3:7 లో మనం చూస్తాం,
అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడే దేవునిని ఎరిగిన వారమౌతాము.
ఈ రోజు మనకు దేవుని వాక్యము పుష్కలంగా లభిస్తుంది. దేవుడు తన ఆత్మ ద్వారా మనకి ఇచ్చిన 66 పుస్తకాలే (బైబిల్ ) దేవుని వాక్యము. దేవుడు తన రక్షణ సంకల్పమును మనకు స్పష్టంగా తెలియచేసాడు.
అంతమాత్రమే కాకుండా మనం అయన బిడ్డలుగా ఎలా జీవించాలో, తన చిత్తాన్ని మనకి బైబిల్ లో ప్రత్యేకముగా బయలుపరచుకున్నాడు. దానికోసం
మన అనుభవాలమీద కానీ, హృదయాలోచనల మీదకానీ, కలలమీదకానీ ఆధారపడాల్సిన అవసరం మనకి లేదు. బైబిల్లోని వాక్యము ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతాడు, వేరే మార్గం ఏమీ లేదు. వాక్యము సత్యము గనుక అది మనలని ఎప్పుడు సత్యము వైపే తీసుకొనివెళ్తుంది. అందును బట్టి మనకు వాక్యాన్ని ఎక్కువగా చదివి , ధ్యానించి (కీర్తనలు 1:2), విని (రోమా 10:17) విధేయత చూపించినప్పుడు, దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడుతాడా లేదా వేరే మార్గాలు ఉన్నాయా అన్న అయోమయంలో పడాల్సిన అవసరం ఉండదు.