పరిచర్యకు వెళ్ళాలనుకునేవారు ఆలిచించాల్సిన 5 విషయాలు

భూమి లోపలి పొరల్లోకి ఏ చెట్టు వేర్లైతే బలంగా చొచ్చుకొనిపోవో ఆ చెట్టు అనతికాలంలోనే పెల్లగించబడుతుంది. మన దేశంలోని క్రీస్తు సంఘం కూడా అదే విధమైన ప్రమాదంలో ఉంది. ఇది చాలా విచారకరం. క్రైస్తవ పరిచర్యలో ఎన్నో విస్తారమైన కార్యములు జరుగుతున్నాయి. కానీ స్థానిక సంఘం చారిత్రాత్మకమైన, వాక్యానుసారమైన, దైవశాస్త్ర పరమైన ఆశ్రయాన్ని కోల్పోయిందని నా అభిప్రాయం. దీని ఫలితంగా మనకు చాలా సంఘాలున్నాయి. కాని వాటిలో హితబోధ ఆశించిన స్థాయిలో లేదు.పలు సువార్త సభలు జరుగుతున్నాయి.కాని నిజంగా మార్పు చెందినవారి సంఖ్య అత్యల్పంగానే ఉంది. అనేకమంది కాపరులు ఉన్నారు కాని పరిచర్యకు అర్హులైనవారు చాలా తక్కువమందే ఉన్నారు. ఫలితాల కోసం అన్వేషిస్తూ బైబిలులోని గొప్ప ఆజ్ఞను, సంఖ్యను పెంచుకోవాలనే ఆరాటంతో నాణ్యతనూ, సమస్యల్ని పరిష్కరించుకోవాలనే ఆత్రుతతో వాక్య ఆచరణనూ స్థానిక సంఘం పణంగా పెట్టేసింది.

అందువలన కాపరులకూ/ప్రసంగీకులకూ/సువార్తీకులకు ఉండాల్సిన అర్హతలు ప్రమాణాన్ని మనం తగ్గించేసాం, ఇది పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదు. సువార్త పరిచర్యకు పిలుపు గురించి బైబిలు చెబుతున్న దానిపై మనం దృష్టి పెట్టుటలేదు. బైబిల్లోని ఆజ్ఞలను సవరించడానికి ఏ ఒక్కరికీ అధికారం లేదని మనం మరచిపోయాము. సువార్త పరిచర్యకు పిలుపునందుకునేవారికి కూడా బైబిలులో ఆజ్ఞలున్నాయి. ఈ ఆజ్ఞలను కూడా ఎవ్వరూ సవరించకూడదు.

నా స్నేహితులారా! పరిచర్య చెయడానికి మీకున్న పిలుపు గురించి మీరు ఆలోచిస్తుండగా నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను.

1.మీరు తిరిగి జన్మించారా..?

ఈ పశ్న చాలా ప్రాధమికమైనదిగా కనబడవచ్చు కాని తరచూ ఈప్రశ్నను అందరూ విస్మరిస్తున్నారు, ఇది శోచనీయం. ఎవరైనా సువార్తకు పరిచారకుడు కావాలనుకుంటూ, దేవుని కృప యొక్క, యేసు క్రీస్తు నీతి యొక్క అవసరతను గుర్తించకుండా, తను ఒక నిస్సహాయకరమైన, దయనీయమైన స్థితిలోనున్న పాపపిని అని గుర్తించకపోతే, అతడు కాపరి/ ప్రసంగీకుడు/ సువార్తికుడు కావాలని ఆలోచించడం మానేసి తన ఆత్మ గురించి చింతపడడం ప్రారంభించాలి. కాపరులు/ ప్రసంగీకులు/ సువార్తీకులు నిజంగా తిరిగి జన్మించిన వారైయుంటే ఎంతో అనర్థం సంఘానికి తప్పిపోయేది.

పాపుల్ని రక్షించడానికి క్రీస్తుయేసు ఈ లోకానికి వచ్చాడన్న వాక్యము నమ్మతగినది,పూర్ణాంగీకారానికి యోగ్యమైనది అయి ఉంది. అట్టి పాపుల్లో నేను ప్రధానుడను, అని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి.(1తిమోతి1:15).
ఒకప్పుడు పౌలు దేవదూషణ చేసినవాడు, సంఘమును హింసించినవాడు. హంతకుడు(1తిమోతి1:12-13); అయితే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మినప్పుడు అతడు దేవుని కనికరం పొందాడు. భవిష్యత్తులో కాపరి/ ప్రసంగీకుడు/ సువార్తీకుడు కావాలనుకునే వ్యక్తికి ఇదే మొదటి అంశం కావాలి.

2. మీరు సంఘములో వేళ్ళూనికొనియున్నారా..?

స్థానిక సంఘానికి ఎలాంటి సంబంధమూ లేకుండా జరిగే పరిచర్య గురించి పాస్టర్ జాన్ మెకార్థర్ గారు ఇలా అంటున్నారు. “ఒక వ్యక్తి పాస్టర్ గా ఉండాలి తనకు తానుగానే నిర్ణయించుకుని ,తన్ను తానే అభిషేకించుకుని, తన్ను తానే పాస్టర్ గా నియమించుకోవడమనేది లేఖనానికి విరుద్ధమైనది, లేఖనాలలో మనకు ఎక్కువగా కనబడనిది”. తమను తామే కాపరులుగా/ బోధకులుగా ప్రకటించుకుంటున్నవారు చాలామంది భారతదేశంలో ఉన్నారు. ఇదే మనకున్న పెద్ద సమస్య. ఇది లేఖనంలో ఎక్కడా కనబడదనీ, లేఖన విరుద్ధమనీ చెప్పిన జాన్ మెకార్థర్ గారి మాటలు ఏమాత్రమూ అతిశయోక్తి కాదు.

కాపరికి ఉండాల్సిన అర్హతలు గురించి మాట్లాడుతూ 1తిమోతి 3:7లో “అతడు సంఘమునకు వెలుపటి వారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను” అని పౌలు చెబుతున్నాడు. సమాజంలో మంచి సాక్ష్యము ఉన్న సంఘములోపలి ఒక వ్యక్తి గురించి అతడు మాట్లాడుచున్నాడు. కాపరి/పెద్ద/అధ్యక్షుడు కావడానికి ఉండాల్సిన అర్హతలన్నింటినీ 1తిమోతి 3వ అధ్యాయం స్థానిక సంఘము నేపధ్యంలోనే మాట్లాడుతుంది. కాపరి/ పెద్దగా ఉండాలని ప్రయత్నిస్తున్న వ్యక్తికి నైపుణ్యము సచ్ఛీలత ఉన్నాయో లేవో స్థానిక సంఘం గమనించి, ఆమోదించాలి (1తిమోతి4:22-25). స్థానిక సంఘముయొక్క ఆమోదమూ ఆశీర్వాదము లేకుండా కాపరి కావడం బైబులుకు విరుద్ధం. లోపరహిత దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తికి వచ్చిన కలగానీ‌, దర్శనంగానీ నిరర్థకం చేయలేవు/ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా దేవుని వాక్యం కంటే, నా కొచ్చిన దర్శనమే ముఖ్యం అనుకొంటే, దేవుడు అతనిని పిలువలేదు అని నిర్ధారించుకోవచ్చు. మనకు మనమే నియమాలు ఏర్పరచుకోకూడదు., కేవలం దేవుని నియమాలకు లోబడడమే మన కర్తవ్యం.

3. పరిచర్య చేయాలనే స్వచ్చమైన కోరిక , భారం మీకు ఉన్నాయా..?

యేసుక్రీస్తు సంఘానికి పరిచర్య చేయాలనే కోరిక బలమైన లోతైన కోరిక కాపరిగా ఉండాలనే వ్యక్తికి ఉండాలి (1తిమోతి 3:1). కాపరి కావడానికి ముందు డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ తన పిలుపు గురించి పోరాటం చేయాల్సి వచ్చింది. ఒక పక్క ఇంగ్లాండు దేశపు రాజ కుటుంబానికి వ్యక్తిగత వైద్యుడయ్యే అవకాశం వచ్చింది. ఆ బాధ్యత చేబడితే అదెంతో ఘనమైన హోదాను అతనికి తెచ్చిపెడుతోంది. అయితే మరొక పక్క అతని ఉద్యోగం అతనికేమాత్రమూ సంతృప్తినివ్వడం లేదు.మనిషి దేహానికి పట్టిన వ్యాధి అంతుచూడాలనే భారం వైద్యునిగా జోన్స్ కు ఉండేది, అయితే ఆత్మసంబంధమైన వ్యాధుల్ని కూడా నిర్థారణ చేసి మనుష్యులకు సహాయపడాలనే భారం అతనిలో క్రమక్రమంగా పెరిగింది. ఒకనాడు బహిరంగ సువార్త ప్రకటన జరుగుచున్నప్పుడు ప్రసంగీకుణ్ణి తన భార్యకు చూపిస్తూ “నేను అతడు చేసే పనిని చేద్దామనుకుంటున్నాను” అని గద్గద స్వరంతో చెప్పాడు. చివరకు తాను కోరిన విధంగానే తన వైద్య వృత్తిని విడిచిపెట్టి, వేల్స్ (Wales) లోని ఒక చిన్న గ్రామానికి వెళ్ళి , తాను ఎంతగానో ఇష్టపడిన సువార్త ప్రకటన కార్యక్రమాన్ని ఆరంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత లండన్ లో చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ భాపెల్ కి కాపరిగా పిలుపునందుకున్నాడు. నాస్నేహితుడా! యిర్మీయా (యిర్మీయా20:9), పౌలు ( 1కొరింథీ9:16) ల మాదిరిగా పరిచర్య చేయాలనే భారం నీకు లేకపోతే, బహుశా నీకు పరిచర్య పిలుపు లేదేమో!

4. నీవు అర్హుడవైన, పురుషుడువైన పెద్దవేనా..?

తీతుకు తిమోతికి పౌలు వ్రాసిన పత్రికలలో పెద్దలకు ఉండాల్సిన అర్హతల జీవితాలు మనకు కనబడతాయి. వీటిని గమనిస్తే కాపరి ధర్మం కేవలం పురుషులకు మాత్రమే చెందినదని మనకు స్పష్టమౌతుంది. అయితే Egalitarianism (మహిళలు పురుషులతో అన్ని నియమాలలోను సమానమే అనే సిద్ధాంతం) ఈ దినాన ప్రపంచాన్ని ఏలుచున్నది, ఇది శోచనీయం. లేక ప్రపంచం నుంచి సంఘ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది, బైబిలు బోధనలపై తీక్షణమైన దాడులు జరుగుతున్నవి. అయితే నిత్యము మార్పుకు గురయ్యే సమాజాన్ని శాంతిపరచడానికి బైబిలును వక్రీకరించకూడదు. స్త్రీ పురుషులిద్దరూ దేవుని పోలికలో ఉన్నారు కాబట్టి విలువలలో వాళ్ళిద్దరూ సమానమనే మాట నిజమే. అయితే దేవుడు వారిద్దరికీ భిన్నమైన బాధ్యతలు తలాంతులు ఇచ్చాడు. వాటికనుగుణంగా పనిచేస్తే సృష్టిలోని సౌందర్యం మనం చూడగలము.

అంటే స్త్రీలు స్థానిక సంఘములో ప్రసంగ వేదికలపైనుంచి ప్రసంగించకూడదని అర్థం. స్త్రీలకు దైవజ్ఞానం తక్కువుంటుందనీ, వాళ్ళు అయోగ్యులని నేను చెప్పుటలేదు. కానీ స్త్రీ పురుషులిద్దరికీ దేవుడు భిన్నమైన బాధ్యతలను అప్పగించినందువల్లనే నేను ఈమాట చెబుతున్నాను. స్త్రీ పురుషుల బాధ్యతల గురించిన తన అభిప్రాయాన్ని నిరూపించడం కోసం పౌలు సృష్టి ఆరంభ సమయంలో సంఘటనను మనకు గుర్తుచేస్తున్నాడు (1తిమోతి2:13-14). అందువలన స్త్రీ కాపరి అనేమాట స్వయం విరుద్ధమైనది.అయితే సంఘంలో స్త్రీలకు పరిచర్య చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సాటి స్త్రీలకూ(తీతు 2:3-5) పిల్లలకూ(2తిమోతి 1:5), ప్రసంగ వేదికలపైనుంచి కాక గృహాల్లో పురుషులకు సైతం (అపొ.18:18-28) బోధించడానికి దైవశాస్త్రాన్ని నేర్చుకోమని బైబిల్ స్త్రీలను ప్రోత్సాహిస్తోంది.

5. వేదాంత విద్య ( Theological Training)గురించిన ఆసక్తి నిన్ను బందిస్తోందా..?

పరిచర్యకు అర్హత సాధించడానికి తప్పనిసరిగా కేవలం అవసరమైంది “వేదాంత విద్యననే దురాభిప్రాయం భారతదేశంలో ఉంది. ఈ బాధ్యతకు మనల్ని అర్హుల్ని చేసేది ఒక్క సర్టిఫికెటేనని కొందరి వాదన. అందువల్లనే సెమినరీ నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్ పరిచర్యకు వెళ్ళడానికి సిద్ధపడినట్లేనని అనుకుంటున్నారు. అయితే ఇది సత్య దూరమైన విషయం. వ్యక్తుల్ని కాపరులుగా ప్రసంగీకులుగా ఉండటానికి అర్హుల్ని చేసేది సిమెనరీలు కావు. సెమినరీలు కేవలం వ్యక్తులకు శిక్షణనిస్తాయి. స్థానిక సంఘ ఎదుగుదలకు ఇది అత్యంత అవసరమైన పరిచర్య. అయితే సెమినరీలు స్థానిక సంఘాల స్థానాన్ని తీసుకోకూడదు, తీసుకోలేవు. స్థానిక సంఘాలు లేకపోతే సెమినరీలు పనిచేయలేవు కాని సెమినరీలు లేకుండా స్థానిక సంఘాలు పనిచేయగలవు. పరిచర్యకు మనుషుల్ని పంప బాధ్యత స్థానిక సంఘాలదే కానీ సెమినరీలది కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం సెమినరీ విద్య ఒక్కటే వ్యక్తుల్ని కాపరులుగా ప్రసంగీకులుగా తయారుచెయ్యదు. బైబిల్లో తెలుపబడిన అర్హతల్ని ఆధారంగా చేసుకుని స్థానిక సంఘము ఆ వ్యక్తిని పరీక్షించాలి‌, ఆమోదించాలి (1తిమోతి3:1-7; తీతు 1:5 9);

తిరిగి జన్మించిన వారిని, స్థానిక సంఘాన్ని నడిపించడానికి అర్హులైన భారం కలిగిన వ్యక్తుల్ని ఎంపిక చేసుకోవడానికి దేవుడు మన సంఘాలకు సహాయం చేయునుగాక! భక్తిలో ఎదిగి, సమాజాన్ని ప్రభావితం చేయాలంటే మన దేశంలో క్రీస్తు సంఘానికి ఇది అత్యంత అవసరం!

 

 

 

 

Pastor at Reformed Baptist Church, Vinukonda.

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.

EP 01 : Introduction

Welcome to life and Scripture: Discovering God’s truth for everyday living. Welcome to the very first episode of Life and Scripture ! I’m...