Home » క్షమాపణ వలన మనలో కలిగే మార్పులు

క్షమాపణ వలన మనలో కలిగే మార్పులు

క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రధాన భాగం. క్షమాపణ లేకుండా, ఒకరు క్రైస్తవుడిగా అవ్వలేరు . ఒకడు తన పాపాలను ఒప్పుకున్నప్పుడు , దేవుడు తన మహా కృపను బట్టి మన అపరాధాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేసాడు. (1 యోహాను 1:9,కీర్తన 32: 5) . క్షమాపణ క్రైస్తవునికి అపరిచితం కాదు. క్షమాపణ ,సువార్తలో‌ ఉన్న ప్రధాన అంశం. ఇది దేవుని మహా సంకల్పం.

మానవ సంబంధాల్లో, క్షమాపణ అనేది కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగానూ, మరికొన్ని సందర్భాల్లో అసాధ్యంగా కనిపిస్తుంది. ఎన్నో రకాలుగా మనుషులు మనల్ని బాధపెట్టవచ్చు. కొన్ని సార్లు కావాలని చేస్తారు, మరి కొన్ని సార్లు అనుకోకుండా చేస్తారు. మనకి ఆత్మీయులైనవారు బాధపెడితే ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. చాల సార్లు మనకి వచ్చే బాధలు , క్రీస్తును ఎరగని వారినుంచి కన్నా, క్రైస్తవులనుంచే వస్తాయి. మరి కొన్ని సందర్భాల్లో, మన స్నేహితులు, కుటుంబ సభ్యులే దానికి కారణం అవ్వవచ్చు. అప్పుడు ఆ బాధ నరనరాలకు పాకుతుంది. దానివల్ల శరీరం , మనసు రెండిటి మీద ప్రభావం చూపిస్తుంది. బీపీ , ఆందోళన , వేదన , కోపం, చింత, బాధ, ఇంకా ఎన్నిటికో మనం గురౌతుంటాం , దాని వల్ల కొన్ని టన్నుల బరువును మోస్తున్నట్లుగా అనిపిస్తుంది. (సామెతలు 12:24). మీరు అలాంటి పరిస్థితిలో ఉండి మిమ్మును బాధించిన వారిని క్షమించలేకపోతున్నారా ? ఈ వ్యాసం మీకు సహాయపడుతుందని భావిస్తున్నాను. ఇక్కడ నేను , మనం ఒకర్ని క్షమించినప్పుడు లేదా క్షమించే ఆలోచనలో ఉన్నపుడు మనకి ఏమి జరుగుతుందో నాలుగు మాటలను మీ ముందు ఉంచుతున్నాను.

1 క్షమాపణ మనల్ని విముక్తి చేస్తుంది.

క్షమించకపోవడం వల్ల, మన భుజాలపై పెద్ద రాయి ఉన్నట్టుగా అనిపిస్తుంది. హృదయం నుండి కోపం, ద్వేషం, ఆగ్రహం వంటి భావోద్వేగాలు మొలకెత్తుతాయి. వీటికి మనం తెలీకుండానే బందీలం అయిపోతాము. దేవుని ప్రేమను మనం ఇతరులకు చూపించలేము. ఈ భావోద్వేగాలు ఆరోగ్యకరమైనవి కావు మరియు పాపాత్మకమైనవి కూడా . వీటివల్ల మన పిల్లలమీద, కుటుంబ సభ్యులమీద, దుష్ప్రభావం చూపిస్తాయి. దేవుని వాక్యం వీటికి దూరంగా ఉండమని మనకి భోదిస్తుంది.

సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

ఎఫెసీయులకు 4:31-31

అలాగే, దేవుడు మనల్ని మన పాపం యొక్క ఆధిపత్యం నుండి విడుదల చేసాడు కాబట్టి మళ్ళీ ఆ ఉచ్చు లోకి వెళ్లాల్సిన అవసరమేంటి? (యోహాను 8:36 , గలతి 4:3-7). మనం క్షమించినప్పుడు, ఈ బలమైన భావోద్వేగాల నుండి మనం విడుదల పొందుతాము. దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను ఆనందించగలుగుతాం.

2 క్షమాపణ మనల్ని దేవుని దగ్గరికి తీసుకువెళుతుంది.

బాధ తీవ్రత చాల ఎక్కువగా ఉన్నపుడు క్షమించడం కొన్ని సందర్భాల్లో చాల కష్టంగా ఉంటుంది. ఆ బాధ త్రోసివేయలేనిది. అలాంటి సమయాల్లో క్రైస్తవులంగా మనం క్షమించాలని తెలిసినా చేయలేని పరిస్థితి ఉంటుంది (మత్తయి 5:44). ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనంగా ఉంటుంది. విధేయత అసాధ్యంగా కనిపిస్తుంది. అయితే మన బలహీనతను ఎరిగినవాడై, ప్రార్థన ఎలా చేయాలో తెలీని సమయంలో మనలో ఉన్న ఆత్మదేవుడు , దేవుని చిత్త ప్రకారం తానే మన పట్ల విజ్ఞాపన చేస్తాడు. దేవుని ఆజ్ఞలు కష్టంగా అనిపించినప్పటికీ , వాటికీ విధేయత చూపించగల కృపను కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. క్షమించే శక్తి ఆయనే మనకి ఇస్తాడు. కనుక క్షమాపణ మనల్ని దేవుని దగ్గరకు తీసుకునివెళ్తుంది. మన వేదనలో దేవుడు మనకు మంచి స్నేహితుడు (సామెతలు17:17) . అలసిన సమయాల్లో, కృంగిన సమయాల్లో ఆయనే మనకు శాంతి, మన సహాయకుడు.

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

మత్తయి 11:28-30

3 క్షమాపణ దేవుణ్ణి సంతోషపరుస్తుంది.

బైబిల్లోని వివిధ భాగాల్లో క్షమించమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు (మార్కు 11:25-26,మత్తయి 6:14-15, 2 కొరింథీయులు 2:10 , లూకా 17:3, మత్తయి 6:12, మత్తయి 18:21, కోలస్సి 3:13 ), ఎందుకంటే క్షమాపణ అయన లక్షణం. అది అయన చిత్తం కూడా. అందుకే మనల్ని అయన క్షమించి నిత్యజీవాన్ని ఇచ్చాడు. ( దానియేలు 9:9, కీర్తన 85:2, కీర్తన 86:5,కీర్తన 99:8,కీర్తన 103:3, యిర్మీయా 31:34, యిర్మీయా 33:8 ). క్షమాపణ విశ్వాసంతో కూడుకున్న కార్యం కాబట్టి అది దేవున్ని సంతోషపరుస్తుంది (హెబ్రీ 11:6 ). మీరు ఒకరిని క్షమించినప్పుడు, మీరు వానిని దేవుని చేతులకు విశ్వాసంతో అప్పగిస్తున్నారు. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు, వారు పరిశుద్ధుడైన, జీవంగల దేవుని చేతికి అప్పగించబడ్డారు.

ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడిపగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.

రోమా 12:19

కాబట్టి విశ్యాసపూరితంగా క్షమించడం వల్ల మీరు దేవుణ్ణి మహిమపరచే వారౌతారు.

4. క్షమాపణ దేవుని ప్రేమను తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది.

క్షమాపణని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగేది క్రైస్తవుడు మాత్రమే. క్షమాపణకి, ప్రేమకి చాలా దగ్గర సంబంధం ఉంది. క్రైస్తవులుగా, దేవుని క్షమాపణ లేకపోతే మన ఆత్మలు ఏమౌతాయో మనకి బాగా తెలుసు. దేవుని క్షమాపణకు మనం అర్హులం కానప్పటికీ (దానియేలు 9:9-10) , అయన కృపను బట్టి, అయన నామాన్ని బట్టి మనకు క్షమాపణ లభించింది. ( 1 యోహాను 2:12, అపోస్తుల కార్యములు 10:43). మనం విరోధులుగా ఉన్నపుడే దేవుడు మనకొరకు మరణించాడు. (రోమా 5:8) ఇదే దేవుని ప్రేమ. దేవుని గొప్ప ప్రేమ వల్ల మనకు క్షమాపణ లభించింది కాబట్టి , మనం ఇతరులను క్షమించినప్పుడు దేవుని ప్రేమను చూపినవారమౌతాము. మనపట్ల అపరాధం చేసినవారిని మనం క్షమించడం ద్వారా మనం దేవుని ప్రేమను మరింతగా స్పష్టంగా తెలుసుకోవడానికి , అనుభవించడానికి, అది సహాయపడుతుంది.

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.